Wednesday, August 22, 2018

సూర్యచంద్రుల గతులు - గమనాలు - శ్రీ దేవీ భాగవతం

సూర్యచంద్రుల గతులు - గమనాలు - శ్రీ దేవీ భాగవతం
ఇక - ఆపైన ఉన్నది శుద్ధాకాశం. సూర్యుడు ఈ బ్రహ్మాండానికి నట్టనడిమిన ఉన్నాడు కదా! ఈతడు హిరణ్య (బంగారం) అండం నుంచి జన్మించాడు కనుక - ఇతడిని హిరణ్యగర్భుడన్నారు. (కొందరు సూర్యుని గర్భంలో బంగారం ఉందని చెబుతారు.) మృతాండం నుండి జన్మించాడు కనుక, మార్తాండుడనీ అంటారు. ఈ సూర్యగోళానికీ - భూగోళానికీ మధ్య దూరం - పాతిక కోట్ల యోజనాలు. ఈ మహావిశాల విశ్వంలో భూమి, దిక్కులు వగైరా విభజనలకు ఆధారం సూర్యభగవానుడే!
శ్లో|| విషు వత్సంజ్ఞ మాసాద్య గతి సామ్యం వి తన్వతే |
సమస్థాన మాసాద్య దిన సామ్యం కరోతి చ||
ఆరోహణ స్థానంలో మందగతిన ఉంటాడు సూర్యుడు. అది దక్షిణాయణం. కనుక పగళ్లు దీర్ఘం, అవరోహణ స్థానంలో సీఘ్ర గతిన ఉంటాడు. అది ఉత్తరాయణం. కనుక రాత్రులు దీర్ఘం. విఘవత్‌లలో సమగతిలో ఉంటాడు. కనుక పగలూ - రేయీ సమానంగా ఉంటాయి.
రాశుల్లోకి సంక్రమించే సూర్యగతిని బట్టి చెప్పాలంటే - వృషభం నుంచి కన్యారాశి వరకు సూర్యుడు చరిస్తుండగా (దాదాపు 5 నెలల కాలం) పగళ్లు దీర్ఘంగా ఉంటాయి. వృశ్చికం నుంచి మీనరాశి వరకు సూర్యుడు చరిస్తున్నప్పుడు రాత్రులు దీర్ఘం. మేష - తులా రాశుల్లో (విషువత్‌) మాత్రం రాత్రీ పగలూ సమానం. ఈ ప్రకారం సూర్యగతిలో 1. శీఘ్ర 2. మంద 3. సమగతి అనే 3 భేదాలున్నాయి.
ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే - మేరు పర్వతానికి నాలుగువైపులా నాలుగు దిక్పతుల పురాలున్నాయి. అవి. 1. ఐంద్రి (ఇంద్రుని పురి) 2. సంయమని (యమపురి) 3. నిమ్లోచని (వరుణ పురి) 4. విభావరి (కుబేర పురి). ఈ నాలుగు పట్టణాలూ సూర్యగమనానికి నిమిత్తాలు. సూర్యుడు ఇంద్రిలో ఉదయించి, సంయమానికి మధ్యాహ్నం చేరి, నిమ్లోచనిలో అస్తమించి, విభావరిలో రాత్రి విశ్రాంతి తీసుకుంటాడు. అయితే - మేరువు మీద ఉన్నవారికి మాత్రం సూర్యుడు నిరంతరం ఆకాశానికి మధ్యలో ఉన్నట్లే కనిపిస్తాడు. సూర్యోదయం - సూర్యాస్తమయం ఏమిటి? ఆయన నిత్యుడు - శాశ్వతుడు కదా! నిజమే! దర్శన - దర్శనరహిత భేదాల వల్ల ఇవి మనం ఏర్పరుచుకున్నవే! దీనికిదే శ్లోక ప్రామాణ్యం....
శ్లో|| నై వాస్తమన మర్కస్య నో దయః సర్వదా సతః |
ఉదయాస్త మనాఖ్యం హి దర్శనా దర్శనం రవేః ||
ఇప్పుడు చంద్రగ్రహనానికి సంబధించి గమనం. ఇది చిత్రమయినరీతి. సూర్యుడు కాలచక్ర గతుడై 12 రాశులలోనూ సంచరిస్తూ 12 నెలలను కల్పిస్తుండగా చంద్రుడు పక్షద్వయంతో ఈ మాసకాలాన్ని విభజిస్తున్నాడు.
శ్లో|| భానోర్మాంద్య శైఘ్ర్య సమగతిభిః కాల విత్తమైః |
ఏవం భానోర్గతిః ప్రోక్తా చంద్రాదీనాం నిబోధత ||
సూర్యుడికన్నా చంద్రునిది శీఘ్రగతి. ఏయే నక్షత్రాలతో కూడి ఉంటే, ఆయా నక్షత్రాల వల్ల మాసాలకు పేర్లు ఏర్పడుతున్నాయి. (ఉదా: చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కూడినపుడు మార్గశిర మాసం) పెరుగుతున్న చంద్ర కళలతో దేవతలకు - తరుగుతున్న చద్రకళలతో పితృదేవతలకు ఇతడు ఇష్టడవుతున్నాడు. సూర్యునికి సంవత్సరం పాటు పట్టే కాలచక్రాన్ని ఈతడు నెలరోజుల్లో అధిగమిస్తున్నాడు. అమృత కిరణుడు. మనస్సుపై ప్రభావం చూపేవాడు. రాత్రి కారకుడు. సర్వజీవకోటికీ ప్రాణం - జీవం చంద్రుడే!
చంద్రునికి 3 లక్షల యోజనాల దూరంలో మేరువుకు ప్రదక్షిణంగా భచక్రం తిరుగుతూ ఉంటుంది. నక్షత్రాలన్నీ ఈ భచక్రంలోనే సంచరిస్తుంటాయి అభిజిత్‌తో కలిసి 28 నక్షత్రాలు.
ఈ భచక్రానికి రెండు లక్షల యోజనాల దూరాన శుక్రగ్రహం. సూర్యునికి ముందు - వెనుకలుగా చరించే ఇతడికీ శీఘ్ర - మంద - సమగతులున్నాయి. లోకోపకారి. ఇతడికి రెండు లక్షల యోజనాల దూరాన బుధుడు సౌమ్యుడు. ఈతడికి రెండు లక్షల యోజనాల పైన అంగారకుడున్నాడు. వక్రించనంతవరకు ఇతడూ శుభుడే! ఆపైన రేండు లక్షల యోజనాల దూరంలో శనైశ్చరుడున్నాడు. చాలా మందగతి గలవాడు. ముప్పై నెలలకు గాని ఒక్కోరాశి నుంచీ కదలడు. అంటే ఒక్కోరాశిలోను 21/2 సం||రాలుంటాడు. సహజంగానే అశుభుడు. సూర్యపుత్రుడైన ఇతడికి కటాక్ష వీక్షణం కూడా ఉంది. కాని అది పొందడానికి శ్రమించాల్సి ఉంటుంది.
ఇక్కడకు నవగ్రహాల ఉనికిని స్థిరపరచిన తరువాత, జగదంబిక, ఈశనైశ్చరునికి 11 లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలాన్ని ఏర్పరచింది. ఈ సప్త ఋషులు లోకాలకు ఎల్లవేళలా శుభం కోరుతూ ఆకాశాన దక్షిణంగా తిరుగుతుంటారు. ఈ సప్తర్షి మండలానికి 13 లక్షల యోజనాల దూరంలో దిక్పాలకులతో సమానంగా దక్షిణం వైపున నిశ్చలంగా కనిపించే సర్వదేవపూజితుడైన ధృవుడున్నాడు. పరమ భాగవతోత్తముడు. లోక వందితుడు. తన తేజస్సుతో ఇతర గ్రహాలను ప్రకాశింపచేస్తుంటాడు. గ్రహ రాశులన్నీ ధ్రువుడి చుట్టూ తిరుగుతూంటాయి.
శ్లో|| ఆ కల్పాంతం చ క్రమంతి ఖే శ్యేనాద్యాః ఖగా ఇవ |
కర్మ సారథ్యయో వాయు వశగాః సర్వ యేవ తే ||
కాల చక్రాన్ని తిప్పే నిమిత్తం గ్రహాలన్నీ ధ్రువుడు కేంద్రబిందువుగా, వాయుప్రేరితాలై కదలాడటం - అదీ ఆ కల్పాంతం వరకు ఆకాశంలో గరుడ పక్షుల్లా చలించటం గొప్ప నిర్మాణ వైచిత్రి. ఈ గ్రహాలే ప్రాణికోటి కర్మల సారధులు. ఈ జ్యోతిర్గణాలు అలా చలిస్తూనే ఉంటాయి తప్ప, ఎన్నడూ రాలిపోవు.
సూర్య మండలానికి క్రిందుగా ఉన్నలోకాలలో సిద్ధ, చారణ, విద్యాధరలోకాలు కూడా ఉన్నాయి. వీటికి క్రిందుగా యక్ష, రాక్షస, పిశాచ, ప్రేత, భూత విహారానికి సంబంధించిన లోకాలూ ఉన్నాయి. వాయుసంచారం ఉన్నంతవరకు అంతరిక్షం అనీ - దీనికి నూరుయోజనాల క్రిందుగా భూగోళం ఉన్నదనీ చెప్పబడింది.

Image may contain: 1 person, text

No comments:

Post a Comment