Monday, July 9, 2012

ద్వాదశ జ్యోతిర్లింగాలు


ద్వాదశ జ్యోతిర్లింగాలు

శైవులు శివున్ని మూర్తి రూపములో మరియు లింగరూపములోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నది. అవి

రామనాథస్వామి లింగము - రామేశ్వరము
మల్లికార్జున లింగము - శ్రీశైలము
భీమశంకర లింగము - భీమా శంకరం
ఘృష్టీశ్వర లింగం - ఘృష్ణేశ్వరం
త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం
సోమనాథ లింగము - సోమనాథ్
నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక)
ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు - ఓంకారక్షేత్రం
మహాకాళ లింగం - ఉజ్జయని
వైధ్యనాథ లింగం - చితా భూమి (దేవఘర్)
విశ్వేశ్వర లింగం - వారణాశి
కేదారేశ్వర - కేదారనాథ్

జ్యోతిర్లింగ స్త్రోత్రము

ఈ జ్యోతిర్లింగ స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకము.
సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.

జ్యోతిర్లింగాలు

సోమనాథుడు - - విరవల్ రేవు, ప్రభాస్ పట్టణము, సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్ - దీనిని ప్రభాస క్షేత్రము అంటారు. చంద్రునిచే ఈ లింగము ప్రతిష్టింపబడినదని స్థలపురాణము.

మల్లికార్జునుడు - శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా వర్ణింపబడినది. ఈ క్షేత్రము అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటి. ఆది శంకరాచార్యుడు శివానందలహరిని ఇక్కడే వ్రాశాడు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి.

మహాకాళుడు - (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్ - క్షిప్రానది ఒడ్డున ఉన్నది. ఈ నగరములో 7 సాగర తీర్థములు, 28 తీర్థములు, 84 సిద్ధ లింగములు, 30 శివలింగములు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరములు, జలకుండము ఉన్నవి.

ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు - మామలేశ్వరము, మధ్య ప్రదేశ్ - నర్మద (రేవా) నదీతీరమున వెలసెను. ఇక్కడ ఒకే లింగము రెండు బాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్నది. అమ్మవారు అన్నపూర్ణ.

వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) - పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్ - బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపములో నున్నది. సహ్యాద్రి కొండల అంచునున్నది. అమృతమధనానంతరము ధన్వంతరిని, అమృతమును ఈ లింగములో దాచిరనీ, స్పృశించిన భక్తులకు అమృతము లభించుననీ నమ్మకము.

భీమశంకరుడు - డాకిని, భువనగిరి జిల్లా, పూనె వద్ద, మహారాష్ట్ర - చంద్రభాగ (భీమ) నది ఒడ్డున, భీమశంకర పర్వతములవద్ద - త్రిపురాపుర సంహారానంతరము మహాశివుడు విశ్రాంతి తీసికొన్న చోటు. అమ్మవారు కమలజాదేవి. శాకిని, ఢాకిని మందిరములు కూడ యున్నవి. మోక్ష కుండము, జ్ఙాన కుండము ఉన్నవి.

రామేశ్వరుడు - రామేశ్వరము, తమిళనాడు - శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలము - కాశీ గంగా జలమును రామేశ్వరమునకు తెచ్చి అర్చించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయము. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.

నాగేశ్వరుడు (నాగనాథుడు)- (దారుకావనము) ద్వారక వద్ద, మహారాష్ట్ర - ఈ జ్యోతిర్లింగము ద్వారక, ఔధ్ గ్రామ్, ఆల్మోరా (ఉత్తరప్రదేశ్) అను మూడు స్థానములలో ఉన్నట్లు చెబుతారు.

విశ్వనాథుడు - వారణాసి, ఉత్తరప్రదేశ్ - కాశి అని కూడ ప్రసిద్ధము - వరుణ, అసి నదులు గంగానదిలో కలిసే స్థానము - పరమపావన తీర్థము - ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి.

త్రయంబకేశ్వర ఆలయం
త్రయంబకేశ్వరుడు - నాసిక్, మహారాష్ట్ర - గౌతమీ తీరమున - ఇక్కడి లింగము చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న (బొటనవేలివంటి) లింగములున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి మందిరము కూడ ఉన్నది. కుశావర్త తీర్థము, గంగాద్వార తీర్థము, వరాహ తీర్థము ముఖ్యమైనవి. 12 సంవత్సరములకొకమారు జరిగే సింహస్థపర్వము పెద్ద పండుగ.

కేదారేశ్వరుడు - హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో- మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.

ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు) - వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర - (దేవగిరి లోనిదే జ్యోతిర్లింగమని కూడ చెప్పుదురు)

No comments:

Post a Comment