శ్రీ శుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి వారు ప్రచురించిన "తత్వసారము" అను చిన్న పుస్తకమునుండి జనసామాన్యమునకు కూడ అందుబాటులో ఉండేటట్లుగ, చక్కగా అర్థమయ్యేటట్లుగ, సులభమైన భాషలో జటిలముకాని భావముతో, ఉపనిషత్తులు, శ్రీమద్ భగవద్ గీత మొదలగు ప్రామాణిక గ్రంథములందుగల దర్మ రహస్యములను సర్వ జనులకు తేటతెల్లముగ తెలియులాగున మరియు హాయిగా పాడుకొని ఆనందిచేటట్లుగా శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు రచించియుండిరి.ఇందు 108 తత్వములు కలవు. ముముక్షువులు వీనిని చక్కగ మననము చేసుకొని ఆనందానుభూతిని పొందెదరని విశ్వసిస్తా.
1.
తత్వసారము తెలిసికోరన్నా
సద్గురుని చెంత, నిజము గనుగొని లాభమొందన్నా
పామరత్వము పారద్రోలి
ద్వేషభావము రూపుమాపి
అంతటను పరమాత్మ కలడని
నెమ్మనంబున బోద సల్పుము.
|| త ||
2.
పాముకాదు తాడురోరన్నా
దీపకాంతిలో, సత్యవిషయము తెలిసికోరన్నా
తాడు తాడైయుండి యుండగ
తాడు పామని భ్రమసి ఏడ్చుచు
తామసంబున కాలమంతయు
పాడుచేయక నొందుము
|| త ||
3.
ఆలుబిడ్డలు వెంటరారాన్నా
నిజమెరిగి నీవు, బంధుజాలపు మమతవీడన్నా
పక్షిజాలము చెట్టుపైన
చేరియుండును సంధ్యవేళ
పొద్దుపొడవగ పక్షులన్నియు
వీడిపోవును వేరువేరుగా
|| త ||
4.
తనువు నిత్యము కాదురోరన్నా
ధరణిపైయది, ఎల్లకాలము ఉండబోదన్నా
దండధరుడు పొంచియుండగ
పాపకార్యము ఏలచేయుదు
పాశహస్తుడు రాకపూర్వమె
ధర్మమార్గము దరికి చేర్చుము.
|| త ||
5.
గీత సతతము ఆశ్రయించన్నా
ఉపనిషత్తుల, సారమేయది తెలిసికోరన్నా
గీతమాతకు సేవసలిపి
గీతతత్వము మదిని దాల్చి
గీత చెప్పిన కృష్ణ దేవుని
పాదపద్మము నమ్మి కొలువుము.
|| త ||
6.
తనువుచూసి మురిసిపోకన్నా
మట్టిబొమ్మది, అందమేమియు లేదు లేదన్నా
అందమైన ఆత్మవదలి
నింద్యమైన మేను నేనని
తలపువీడి శాశ్వతంబగు
సచ్చిదాత్మను స్మరణచేయుము.
|| త ||
7.
మట్టివంటిది దేహమోరన్నా
జడమైనదేయది, చిత్స్వరూపము కాదు కాదన్నా
కుండవంటి మేను గాంచి
చేతనంబని తలచువాడు
సత్యమేమియో తెలియలేకనె
గోతిలో పడిపోవు తథ్యము
|| త ||
8.
మనసుపైన జయము పొందన్నా
ఇంద్రియంబుల, టక్కు చూచి మోసపోకన్నా
దేహమండలి చతురచోరుల
చర్యలన్నియు గాంచుచుండుము
బుధ్ది కుశలత గలిగి నేర్పుతో
వాని నెల్లను తరిమివైచుము.
|| త ||
No comments:
Post a Comment