Sunday, January 20, 2013

సృష్టి -- రచన :: ఎ. విజయరామారావు


సృష్టి  --  రచన :: . విజయరామారావు (శివానందభారతి మాస పత్రిక - డిసెంబర్ 2012)
ఇయం విసృష్టిర్యత ఆబభూపయది వాదధేయదివాన |
యో2స్యాధ్యక్షః పరమేవ్యోమంత్సో అంగవేదయదివానవేద ||
(ఋగ్వేదం 10-129-7)

ఎవరు సృష్టి రచన చేసారో, ఎవరు ధారణ, ప్రళయకారకుడో, ఎవరు జగత్తుకు ప్రభువో అతడే పరమాత్మ అని తెలుసుకోవాలి.

తమ ఆసీత్ తమసాగూఢ మగ్రే2ప్రకేతం సలిలం సర్వమాఇదం |
తుచ్చ్యేనాభ్యపి హితం తదాసీత్తవ సస్తన్మహి నాజాయతైకమ్ ||
(ఋగ్వేదం 10-129-3)

సృష్టి కన్నా ముందు జగత్తులో అంతా అంధకారం ఆవరించి ఉండింది . రాత్రి, పగలు అనే తేడాలు లేవు. దీన్ని ఈశ్వరుడు కార్యరూపంలోకి మార్చాడు.

పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యమ్ |
ఉతామ్రుతత్వే స్యేశానోయదన్నే నాతిరోహతి ||
(యజుర్వేదం 31-2)

ఈయన పూర్ణ పురుషుడు. నాశరహితుడు. జీవులకు స్వామి. ప్రుథివ్యాది జడాలకన్నా జీవులకన్నా వేరైన తత్వం. పురుషుడే భూతభవిశ్యత్ వర్తమాన జగద్రచన చేశాడు.

యతోవా ఇమానిభూతాని జాయన్తే యేనజాతాని జీవన్తి |
యత్ప్రయన్త్యభి సంవిశన్తి తద్విజిజ్ణాసస్వతద్బ్రహ్మ ||
(తైత్తిరీయం-భ్రుగువల్లి - 1)

పరమాత్మ రచనవల్ల ప్రుథివ్యాది భూతాలు ఉత్పన్నం అయ్యాయి. సృష్టిలోనే జీవుల ఉనికి ఉన్నది. చివరకు ప్రళయం సంభవిస్తుంది. వీటికి కారణం బ్రహ్మమేఅని తెలుసుకోవాలి.
పైవాటివల్ల సృష్టికి స్రష్ట ఈశ్వరుడే అనీ, వేరెవ్వరుకాదనీ, తనకు తానుగా జగత్తు ఏర్పడలేదనీ, తెలుస్తోంది. సంయోగ-వియోగాలు విరుద్ధ గుణాలు కావున ఇవిచేయడానికి ఒక కర్త కావాలి.
జన్మాద్యస్యయతః (వేదాంతదర్శనం 1-1-2)
జగత్తు జన్మకు,స్థితికి, ప్రళయానికి కారకుడు బ్రహ్మమే అంటాడు వేదవ్యాసుడు. 'తమ ఆసీత్ తమసాగూఢమగ్రే' అనే వేదమంత్రం సృష్టికన్నా పూర్వం అంధకారం ఆవరించి ఉండేదని అన్నది.

ఆసీదిదం తమోభ్రుత మప్రజ్ణాతమలక్షణమ్ |
అప్రతర్క్యమజ్ణేయం ప్రసుప్తమివ సర్వతః ||
(మనుస్మృతి 1-5)

'సృష్టకి పూర్వం అంతా అంధకారమయం, ప్రళయారంభంలో కూడా అంతే. అప్పుడు ఏదీ తెలుసుకోవడం, తర్కించడం,ఇంద్రియాలతో గుర్తించడం వీలుకాదుసృష్టి రచన తరువాతే గుర్తించడానికి వేర్వేరు చిహ్నాలు మనకు లభిస్తాయి.
' ఈశో అస్య ద్విపదశ్చతుష్పదః' -- 'పరమేశ్వరుడు సమస్త చరాచరాలున్న జగత్తుకు నిర్మాత' అని వేదం అంటున్నది. 'యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ' -- 'జీవ, నిర్జీవ అంటే చేతన, అచేతన జగత్తుకు మహిమాన్వితుడైన బ్రహ్మమే రాజు'. 

యత్పర మమవమంయచ్చ మధ్యమం ప్రజాపతిః ససృజే విశ్వరూపం |
కియతాస్కంభః ప్రవివేశ తత్రయన్న ప్రవిశత్ కియత్తద్ బభూవ ||
(అథర్వవేదం 10-4-8)
దేవాః పితరో మనుష్యాగంధర్వాప్సరసశ్చయే |
ఉచ్చిష్టాత్  జజ్జిరే సర్వేదివిదేవా దివిశ్రితః ||
(అథర్వవేదం 11-4-27)

ఉత్తమ, మధ్యమ, నీచలోకాల రచయిత ఈశ్వరుడు. నానారకాల సృష్టి గుణాలు విద్వాంసుడికి తెలుస్తాయి. పితరులు, దేవతలు, మనుష్యులు, గంధర్వులు, అప్సరసలు ఈశ్వరుడి సామర్ధ్యం వల్లే జనించారు. ప్రకాశస్వరుపులైన సూర్యచంద్రాదులు ఉత్పత్తికి కారణం ఆయనే.

మూలే మూలాభావాదమూలం మూలం (సాంఖ్య దర్శనం 1-67)

మూలానికి మూలం ఉండదు. కారణానికి కారణం ఉండదు. అన్ని కార్యాలకు కారణం ఉంటుంది. పరమేశ్వరుడు, ప్రక్రుతి, జీవులు, కాలం -- అనాది. వీటికి మూలం, కారణాలు ఉండవు. శూన్యం నుంచి సృష్టి కాదు. అభావం నుంచి భావం జనించదు . జగత్తు నిత్యం కాదు. నిత్యపరిణామి. పదార్థానికి నాశనంలేదు.

సూర్యా చంద్రమసౌధాతాయథా పూర్వమకల్పయత్ |
దివంచ ప్రిథివీంచాన్తరిక్షమథో స్వః ||
(ఋగ్వేదం 10-190-3)

'ధాత అయిన పరమేశ్వరుడు పూర్వకాలంలోలాగానే సూర్యుడు చంద్రుడు, విద్యుత్తు, పృథివి, అంతరిక్షం -- వీటిని నిర్మించాడు. ప్రక్రియ సదా కొనసాగుతూ ఉంటుంది.

తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశః సంభూతః | ఆకాశాద్వాయుః |
వాయోరగ్నిః | అగ్నేరపః | అద్భ్యః ప్రిథివీ | ప్రిథివ్యా ఓషథయః |
ఓషధిబ్యో2న్నమ్ | అన్నాద్రేత | రేతనః పురుషః | సవాఏష పురుషః |
అన్నరసమయః ||
(తైత్తిరీయోపనిషత్-బ్రహ్మానందవల్లి - 1)
ఆయనవల్ల ఆకాశం తర్వాత వాయువు, అగ్ని, జలం, పృథ్వీ, పృథివి  నుంచి ఓషధులు, ఓషధులవల్ల అన్నం, అన్నంవల్ల వీర్యం, విర్యంతో శరీరం ఏర్పడతాయి అని క్రమంలో వివరించాడు. కార్యజగత్తులో ఏదీ క్రియలేకుండా ఏర్పడదని పూర్వ మీమాంస అంటుంది.

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వన్తికే |
తదంతరస్య సర్వస్యతదు సర్వస్యాస్య బాహ్యతః ||
(యజుర్వేదం 40-6)
ఈశ్వరుడు ప్రకృతిలోని పరమాణువులకు చలనం ప్రసాదిస్తాడు. కాని, తను చలనానికి లోనుకాడు. జగద్రచనచేసి, దానిలోపలా, బయటా ఉంటాడు.
అయితే, ఈశ్వరుడికి జగద్రచనవల్ల ఏం ప్రయోజనం? ఆయన ప్రపంచాన్ని ఎందుకు తయారు చేశాడు? జగత్తే లేకపోతే జీవులకు సుఖదుఖాలు ఉండవు కదా? అంటే ప్రళయంలో జీవులకు సుఖదుఃఖాలుండవు. పవిత్రత్మాలకు జీవన్ముక్తి సాధనం, ఆనందమయమైన మోక్షం ప్రాప్తిస్తుంది. ప్రళయంలో ఉండే పాపకర్ములకు, సుషుప్తి అవస్థలో ఉండే వాళ్ళకు మోక్షం లభించదు. పుణ్య, పాప కర్మల భోగ నిమిత్తం విజ్ఞాన బలసంపంన్నుడు, న్యాయమూర్తి దయాళువైన ఈశ్వరుడు జీవుల కోసం జగద్రచన చేస్తాడు. కర్మఫలానుభవమ్ ప్రపంచ నిర్మాణంతోనే సాధ్యం. ఈశ్వరుడి జ్ఞానబలక్రియలతో సృష్టిరచన సాగుతుంది. మనుష్యుల తొలి సృష్టి త్రివిష్టప్ (టిబెట్) లో జరిగిందని ప్రాచీనుల విశ్వాసం. ఆకాశంలో సంభవించిన విస్ఫోటకంవల్ల వాయువు, అగ్ని, జలం, పృథివి,  క్రమంగా ఏర్పడ్డాయనే తైత్తీరీయం ప్రతిపాదన అందరు శాస్త్రజ్ఞులు ఒప్పుకునేదే. అన్నంవల్ల రేతస్సు, దాంతో పురుషుడి ప్రాదుర్భావం (ఛాందొగ్యం, బ్రహ్మసూత్రాలు), అందరికి అంగీకారమే.

No comments:

Post a Comment